క్రికెటర్లకు ఐసీసీ కీలక సూచనలు

వాస్తవం ప్రతినిధి: వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఆటగాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఐసీసీ సూచించింది. క్రికెట్‌ పునరుద్ధరణ జరిగే సమయానికి ఆటగాళ్లంతా తమ అలవాట్లను మార్చుకోవాలని పేర్కొంది. ‘శిక్షణ వేదికల వద్ద ఆటగాళ్లందరికీ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ప్రాక్టీస్‌ సమయంలో ఆటగాళ్లంతా చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయి శిక్షణ ఆరంభించాలి. ప్రాక్టీస్‌ వద్ద సిబ్బంది సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. శిక్షణకు ముందు, తర్వాత ఆటగాళ్ల వ్యక్తిగత వస్తువులను శానిటైజ్‌ చేసుకోవాలి. ఒకరి వస్తువులను మరొకరు వాడరాదు. ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎక్కువసేపు ఉండకూడదు’ అని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు.

‘మైదానంలో ఆటగాళ్లు, అంపైర్లు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి. ప్లేయర్లు వినియోగించే క్యాప్‌, టవల్స్‌, సన్‌గ్లాసెస్‌, జంపర్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో అంపైర్లకు ఇవ్వకూడదు. శిక్షణ సమయంలో ఆటగాళ్లు కాలకృత్యాలకు వెళ్లడానికి లేదు. ఆటగాళ్లు తమ వ్యక్తిగత వస్తువులను వాడటానికి ముందు తర్వాత చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. మైదానంలో అంపైర్లు బంతిని ముట్టుకోవాలంటే తప్పక గ్లౌజ్‌లు ధరించాలి’ అని ఐసీసీ పేర్కొంది.