సుద్దాల అశోక్ తేజ హెల్త్ పై క్లారిటీ ఇచ్చిన ఉత్తేజ్

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు నేడు సర్జరీ జరగనున్నది. కొన్ని రోజుల నుంచి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతతో శుక్రవారం గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ సర్జరీకి అవసరమైన రక్తాన్ని అందించేందుకు 15 మంది రక్తదాతలు ఏఐజీలో రక్తదానం చేశారని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అశోక్ తేజ‌కు వ‌ర‌స‌కు అల్లుడైన ఉత్తేజ్ స్పందిస్తూ మా మామయ్య ఆరోగ్యం గురించి రకరకాలుగా రాస్తున్నారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ర‌క్తం అవసరమైంది. వెంటనే నేను చిరంజీవిగారి బ్లడ్ బ్యాంక్‌కు ఫోన్ చేయడం.. వాళ్లు ర‌క్త‌దాత‌ల్ని పంపించ‌డం జ‌రుగుతోంది. మావ‌య్య మీద గౌరవంతో, ప్రేమతో ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగిన వారందరికీ చాలా థ్యాంక్స్. చిరంజీవి గారు కూడా ఫోన్ చేశారు. మామయ్యకు ఎలా ఉందని కనుక్కుని, వీలైతే ఆయ‌న‌తో మాట్లాడించమ‌ని చెప్పారు. నేను వెంటనే మామయ్యతో మాట్లాడించాను. అన్నయ్య మాటలు మామయ్యకు కొండంత ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించాయి అని ఉత్తేజ్ వీడియో ద్వారా చెప్పాడు.