వలసకూలీలపై క్లోరినేషన్.. మరీ ఇంత నిర్లక్ష్యమా..?

వాస్తవం ప్రతినిధి: లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైలులో సొంతూళ్లకు వెళ్లాలని ఎదురుచూస్తున్న వలసకూలీలకు న్యూఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్య పరీక్షల కోసం నిలుచున్న కూలీలపై సిబ్బంది రసాయనాలు పిచికారీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

శ్రామిక్‌ రైలులో ప్రయాణించిన వందలాది మంది కూలీలు ఢిల్లీలోని లజ్‌పత్‌ నగర్‌ బడి వద్దకు చేరుకున్నారు. అక్కడ వారికి కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి రోడ్ల పక్కన రసాయనాలు పిచికారీ చేస్తోన్న సిబ్బంది, కూలీలపై కూడా స్ప్రే చేశారు.

అయితే ఈ ఘటనపై ఎస్‌ఎండీసీ స్పందిస్తూ.. ‘ క్షమించండి.. అది కావాలని చేసింది కాదు. క్రిమి సంహారక మందు చల్లుతున్న సమయంలో పొరపాటుగా జెట్టింగ్‌ మిషన్‌ డైరెక్షన్‌ మారడంతో వలస కూలీలపైకి స్ర్పే వెళ్లింది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ముందే ఉహించిన తాము సిబ్బందికి స్ప్రే చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించాం. అయినా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. అయితే స్ర్పే సమయంలో జెట్టింగ్‌ మిషన్‌లో రీకాయిల్‌పై ఒత్తిడి పెరగడంతోనే ఇలా జరిగిందంటూ’ తెలిపింది.