ఏం చెప్పితివి రోజమ్మ..!

వాస్తవం ప్రతినిధి: రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖిస్తూ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అఖండ విజయం సాధించి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. 2019 మే 11వతేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగగా మే 23న ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్సార్‌సీపీ ఏకంగా 151 అసెంబ్లీ నియోజక వర్గాలు, 22 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో నెగ్గి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన 2019 ఎన్నికల్లో 86 శాతం అసెంబ్లీ సీట్లు, 92 శాతం ఎంపీ సీట్లను సాధించి తిరుగులేని ప్రజాబలంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజేతగా నిలిచారు. వైయస్‌ఆర్‌ సీపీకి ప్రజలు అఖండమైన విజయాన్ని అందించి నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సంబరాలు నిర్వహించుకుంటున్నారు వైసీపీ శ్రేణులు.

అయితే ఈ సంధర్బంగా వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ” జగనన్న వచ్చిన తరువాత నిజమైన రాజన్న పాలన మళ్లీ రావడం పట్ల ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. జగన్ గారి నాయకత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేయడం గర్వంగా ఉంది. జగనన్న మాట ఇవ్వడానికి ఆలోచిస్తారేమో కాని.. మాట ఇస్తే మాత్రం కట్టుబడే ఉంటారు. అందుకే ఆయన కుటుంబం మాటతప్పని, మడమ తిప్పని కుటుంబంగానే ఉంది. ఇన్ని లక్షల కోట్లు అప్పులు ఉన్నా సరే.. జగన్ ముఖ్యమంత్రి అయిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను దాదాపు 90 శాతం పూర్తి చేశారు. పేదవాళ్లకి వైద్యం అందించాలని ఆనాడు వైఎస్ ఆర్ ఏవైతే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారో జగన్ గారు కూడా అంతే తరహాలో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాలకు ఉంటారు.. కాని మనసున్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే ఉన్నారు. ఆయన పాలనకు మార్కులు వేయాలంటే నూటికి నూరు వేస్తా” అంటూ.. జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు రోజమ్మ.