ప్రభుత్వం కీలక నిర్ణయం..వారికోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు!

 వాస్తవం ప్రతినిధి: లాక్ డౌన్ లో ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది మణిపూర్ ప్రజలు తిరిగి స్వరాష్ట్రానికి వచ్చారు. వారిలో ట్రాన్స్ జెండర్లు కూడా ఉన్నారు. అయితే పురుషులు, మహిళలతో పాటుగా ట్రాన్స్ జెండర్లను కూడా ఒకే క్వారంటైన్ సెంటర్ లో ఉంచడం ద్వారా, ట్రాన్స్ జెండర్లు అసౌకర్యానికి గురవుతున్నారు. తమకు ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా అందాయి. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రానికి తిరిగి వస్తున్న ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాల్లో కేవలం ట్రాన్స్ జెండర్లను మాత్రమే ఉంచుతారు. వారి భావోద్వేగ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. ట్రాన్స్ జెండర్ల కోసం ఇంపాల్ లో రెండు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాము. అందులో ఒకటి వారి కోసం అంకితమైన కేంద్రం. ట్రాన్స్ జెండర్ల కోసం ఇలా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని మణిపూర్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉత్తమ్ తెలిపారు.