జగన్‌ గారు.. మీకు వినపడటం లేదా..?

వాస్తవం ప్రతినిధి: ఏపిలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. టిడిపి వైసిపిల మధ్య ట్వీట్ ల వార్ ముదిరిపోతుంది. జగన్ సర్కార్ పై, జగన్ తీరు పై టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ జగన్ పై ట్విట్టర్ సాక్షిగా మండిపడ్డారు. కోటీశ్వరుల కంపెనీలకు విద్యుత్ చార్జీలను రద్దు చేయడంపై టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ ఖాతాలో … “లాక్‌డౌన్‌ సమయంలో శ్లాబులు మార్చి.. రేట్లు పెంచి.. పేద, మధ్య తరగతి వర్గాలను బాదేశారు. రూ.కోట్ల ప్రజాధనంతో పత్రికలలో ప్రకటనలు ఇస్తున్నారు. కోటీశ్వరుల కంపెనీలకు రూ.187 కోట్ల విద్యుత్‌ చార్జీలను రద్దు చేశారు. కోటి 35 లక్షల వినియోగదారుల చార్జీలను.. రద్దు చేయమంటుంటే మాత్రం వినపడటం లేదా…జగన్‌ గారు” అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.