ఓ కరోనా…కలకాలం వర్ధిల్లు మా!

ఆర్టిస్ట్ : శ్యామ్

కరోనా .. ఓ …  కరోనా … నీకొక మంచి సలహా !

ప్రపంచం మొత్తం నీ పేరే జపిస్తూంది. నీవు ఎక్కడ పుట్టావో, ఎవరికి పుట్టావో ప్రపంచం లో ఎవ్వరికీ తెలీదు, ఒక్క చైనా దేశ పాలకులకి తప్ప .

నీ దేశంలో నీలాంటి కంటికి కనిపించని సూక్ష్మ రూప మహమ్మారులు జీవం పోసుకొని కొన్ని వందల, వేల సంఖ్యలో మనుషుల్ని, జంతువులని పొట్టన బెట్టుకోవడం చాలా సహజం గా జరిగే వ్యవహారం కాబట్టి, తొలి దశ లో మిగిలిన ప్రపంచ దేశాలు నిన్ను పెద్దగా పట్టించుకోలేదు.

నీ పుట్టినింటి మీద ప్రేమతో అక్కడ పెద్ద నష్టం చేయకుండా ఆ దేశాన్ని వదిలిపెట్టి, నెల రోజుల వ్యవధిలో ప్రపంచంలోని ఇతర దేశాలకు ప్రాకటం మొదలు పెట్టి, రెండు నెలల కాలంలో ప్రపంచం మొత్తం ఆక్రమించావు.

తమ వృత్తి ధర్మానికి అహర్నిశలు శ్రమిస్తున్న దేవుళ్ళ తో సమానమైన వైద్య సిబ్బంది ని కొంచెం కూడా జాలి లేకుండా అమానుషంగా పొట్టనబెట్టుకుంటున్నావు. వారి కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నావు.

అనుభవం మూర్తీభవించిన వృద్దులు నరకయాతన అనుభవించి, కొడుకుల, కూతుర్ల, మనవళ్ల, మనవరాళ్ల కు కడసారి చూపులు కూడా మిగలకుండా, దిక్కులేని అనాధలు గా ఆసుపత్రిలో నే మరణిస్తూ కాల గర్భంలో కలిసిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలను హృదయ విదారక విషాదానికి గురి చేస్తున్నావు.

ప్రపంచంలో ప్రతి దేశాన్ని అదిలించి, భయపెట్టి పెత్తనం చెలాయించే అమెరికా ని ఘోరమైన చావు దెబ్బ కొట్టావు. మిగిలిన అన్ని ప్రపంచ దేశాల కన్నా దారుణంగా నష్ట పోయేలా చేశావు. ఆ దేశ చక్రవర్తి నివాసం, శ్వేత సౌధాన్ని హస్తగతం చేసుకున్నావు.నిన్ను కట్టడి చేయగల శక్తి లేక ఆ అగ్రరాజ్యం గడ గడ వణుకుతుంది.

ఒకప్పుడు నీలాగే ప్రపంచం మొత్తం జైత్ర యాత్ర చేసి, అన్ని దేశాలు ఆక్రమించి భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన బ్రిటిష్ రాజ్యాన్ని కూడా మట్టి కరిపించి మూల కూర్చో పెట్టావు.

మానవాళి దశాబ్దాలుగా నిర్మించుకున్న ఆర్ధిక సౌధాలను నేల మట్టం చేస్తున్నావు. మానవ భవిష్యత్తు కానరాని అంధకారం లో ముంచేస్తున్నావు.నిన్ను నిలువరించే ఔషధం ఏమిటో నీకు తప్ప ఎవరికీ తెలియదు. ప్రపంచంలో ఇంత మంది మేధావులు వున్నా, నీకు విరుగుడు కనిపెట్టడం ఇంతవరకు ఎవరి వల్లా కాలేదు. నువ్వు పుట్టి ఆరు నెలలు కావస్తుండగా నీ మారణ హోమం ప్రపంచ వ్యాప్తంగా నిరాటంగా సాగిపోతూనే వుంది.

ఈ సందర్భంగా నీకొక చిన్న విన్నపం, …. ఒక చిన్న సలహా అనుకో …

చరిత్రలో చిరకాలం నీ పేరు నిలబడి పోయేలా ….

తరతరాలు నిన్ను ఓ దేవత గా పూజించేలా చేసే ఓ మంచి ఆలోచన …

జాగ్రత్త గా చదువు ..

ప్రస్తుతం మనుషుల ప్రాణాలు తీయడం లో నీ కొక లాజిక్ ఉందని, దాన్ని చాలా చక్కగా ఫాలో అవుతూ జాతి, మతం , ప్రాంతం తేడాలు లేకుండా నీ పని నువ్వు చేసుకు పోతున్నావని శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తున్నారు.

ఆ లాజిక్ ప్రకారం రక రకాల ఆరోగ్య సమస్యల తో బాధ పడుతున్న వారిని, వయసు అయిపోయిన వృద్దులని ఏరి ఏరి చంపుకుంటూ పోతున్నావు .

ఆరోగ్య సమస్యల తో సగం చచ్చిన వాళ్ళని , రేపో మాపో ఎలాగూ తనువు చాలించే వృద్దులని చంపడం గొప్ప విషయం కాదు. వాళ్ళను చంపడానికి నువ్వు ఇంత కష్టపడి పోవాల్సిన అవసరం లేదు …

వంటి నిండా జబ్బులతో, కొంచెం ఎక్కువ తిన్నా, కొంచెం తక్కువ తిన్నా పుటుక్కున చచ్చే బలహీనులను చంపడం పరాక్రమం కాదు. త్వరలో చావ బోయే , మూల నున్న ముసలివాళ్లను చంపడం వీరత్వం అనిపించు కోదు. ఈ చావుల వల్ల నువ్వు ఒక దుష్ట పురుగు గా నే మిగిలిపోతావు …

నువ్వు చంపవలసింది అమాయకులను, నిజాయితీ పరులను, నిస్సహాయులను కాదు. ఇకనైనా ఈ అభాగ్యులను చంపడం మాను కో …

నీ చేతిలో నికృష్టపు చావు చావడానికి అర్హత వున్న వాళ్ళను చంపడం మొదలుపెట్టు, నీ శక్తి చూపించు … నీ పరాక్రమం నిరూపించుకో !

నీ చేతిలో చావగా మిగిలిన వాళ్ళు నీ గుడి కట్టి  నిన్ను పూజించే స్థాయి లో నీ చరిత్ర నిలబడి పోవాలి అంటే ..

నువ్వు చంపాల్సింది ఎవరినో తెలుసా ?

 • తమ స్వార్ధం తో సాటి మనిషి ని, ప్రకృతి ని నిలువునా నాశనం చేసే విష పూరిత మేధావులని,
 • నోరు లేని మూగ జీవాలను తమ మనుగడ కోసం, హద్దు మీరిన స్వార్ధం తో క్రూరంగా హింసించే కర్కశ మానవులను,
 • మంచి మాటలతో ప్రజలని వంచన చేస్తూ వాళ్ళని దోచుకుంటున్న కుచిత రాజకీయ నాయకులని,
 • కులానికి, అవినీతికి అమ్ముడు పోయి తమ ధర్మాన్ని కాలరాస్తున్న పాత్రికేయులను,
 • డబ్బు మీద వ్యామోహంతో వైద్య వృత్తికే కళంకం తెస్తున్న నైతిక విలువలు కోల్పోయిన వైద్యులను,
 • న్యాయాన్ని మరచి అన్యాయం తో కుమ్మక్కైన న్యాయ వాదులను,
 • పసి పిల్లల ను, అబలల ను తమ కామానికి క్రూరంగా బలితీసుకునే మానవ మృగాలను,
 • సమాజాన్ని పీల్చుకు తింటున్న లంచ గోండి అధికారులను,
 • ధన దాహంతో వ్యాపారం పేరుతో అమాయకులను, నిస్సహాయులను దోచుకొనే స్వార్ధ వ్యాపారులను,
 • కులం పేరుతొ సాటి మనిషి ని ద్వేషించే కుల పిచ్చగాళ్ళను,
 • కులాన్ని రెచ్చ గొట్టి తన సాటి కులస్తులనే నిలువునా దగా చేసే నికృష్టులను,
 • మితిమీరిన అహంకారం తో తోటి మనుషుల మీద అకారణం గా ద్వేషాన్ని, విషాన్ని చిమ్మే మానవ సర్పాలను,
 • సమాజంలో బలహీనులను తమ రాక్షస బలంతో భయపెట్టి బ్రతుకుతున్న కొవ్వెక్కిన కిరాతకులను,
 • జాతి అహంకారంతో ఇతర బలహీన జాతులను క్రూరం గా అణగ ద్రొక్కె మదాంధుల ను,
 • మతాధిపత్యం కోసం , దేశాధిపత్యం కోసం ఇతర మతాలపై దేశాల పై దురాక్రమణ చేసే దుష్ట దేశాధినేతలను

వాళ్ళు … అలాంటి వాళ్లు …ఏ దేశం లో అయినా , ఏ జాతి లో అయినా, ఏ సమాజంలో అయినా కోకొల్లలు గా ఉన్నారు. వాళ్ళ మీద దాడి చెయ్యి … నీ ఆకలి తీరడానికి, నువ్వు పీక్కు తినడానికి కోట్ల సంఖ్యలో  శవాలు లేస్తాయి.

అలాంటి నీచులను, దుర్మార్గులను నీవు చంప గలిగితే …. అప్పుడు నీకంటూ ఒక చరిత్ర రాయబడుతుంది.

ఎందుకంటే ఆ నికృష్టులు నీకన్నా ఎక్కువ గా ప్రపంచ వినాశనాన్ని సృష్టిస్తున్నారు కనుక. వాళ్ళు నీకన్న మరింత ప్రమాదకారులు కనుక…

చావగా మిగిలిన మనుష్య జాతి నీకొక గుడి కట్టి తీరుతుంది … ప్రస్తుతం గుళ్ల లో వున్న దేవుళ్ళ ని అందరిని పక్కన పెట్టి, జాతి, మతం తేడా లేకుండా అందరూ నిన్నే పూజించు కుంటారు.

ఆలోచించుకో … కరోనా … బాగా ఆలోచించు కో … ఇకనైనా ఈ అమానుషాన్ని ఆపు …
నువ్వు రానున్న శీతాకాలంలో ఎలానూ మరో దండ యాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి …
నీ కిల్లర్ లాజిక్ ని కొంచెం మార్చుకొని … నీ రక్త దాహాన్ని తీర్చుకొంటూ … నీ మరణ మృదంగాన్ని వాయిస్తూ .. ఈ ప్రపంచానికే  నియంతగా కలకాలం వర్ధిల్లు !!!

…Prasad  Thota