తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు !

వాస్తవం ప్రతినిధి:   తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పేసింది. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత… అందులో పనిచేస్తున్న న్యాయమూర్తులనే ఇరు రాష్ట్రాల హైకోర్టులకు విభజించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఒకరిద్దరు న్యాయమూర్తులు అందుబాటులోకి వచ్చినా… పెద్ద ఎత్తున వస్తున్న కేసులు పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా..

తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు హైకోర్టులకు నలుగురు కొత్త న్యాయమూర్తులను కేటాయిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో నలుగురు న్యాయమూర్తులను తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కేటాయిస్తున్నట్లుగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా బొల్లంపల్లి విజయ్‌సేన్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఆమోదముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విజయ్‌సేన్‌ రెడ్డి జడ్జిగా ప్రమాణం చేస్తారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకంతో హైకోర్టు జడ్జిల సంఖ్య 14కు చేరింది.

అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. వారిలో జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ సురేష్ రెడ్డి, జస్టిస్ లలితకుమారి ఉన్నారు.