భారత్ లేక అమెరికా … ఏది గొప్ప దేశం ?

 అహమేవ…

అహమేవ పండితః
అహం పండితః
అహం అపి పండితః
అహం న పండితః

దీని అర్ధం –

నేను మాత్రమే గొప్పవాడిని (మిగిలిన వాళ్ళు అంతా అధములు)
నేను గొప్పవాడిని (ఇంకా కొంతమంది గొప్పవాళ్లు ఉండచ్చు గాక)
నేను కూడా గొప్పవాడిని (ఎంతో మంది గొప్పవాళ్ళలో నేను కూడా ఒకడిని)
నేను గొప్పవాడిని కాను (నేను నేర్చుకోవాలిసినది ఇంకా ఉంది, గొప్పవాళ్ళను నేను గౌరవిస్తాను)

ఏ జాతి అయినా, మతం అయినా, కులం అయినా, సమాజం అయినా చివరకి వ్యక్తి అయినా నేను మాత్రమే గొప్పవాడిని అనుకున్న రోజు అది వారి పతనానికి దారి తీస్తుంది. హిట్లర్, నాజీల పతనం అక్కడే ఆరంభం అయింది. అంతం ఏమిటో చరిత్ర చెప్తుంది. ఈ ప్రపంచం లో భగవంతుడు తప్ప ఏ ఒక్కరూ నేను మాత్రమే గొప్పవాడిని అనుకోజాలరు.

ఈ రోజు భారతదేశం భయంకర కరోనా కోరలపై చేస్తున్న పోరాటం చారిత్రాత్మకం. పరిణతి చెందిన నాయకత్వ సారధ్యానికి తోడుగా అనితర సేవాభావంతో విధులు నిర్వర్తిస్తున్న ఎన్నో రంగాలకు చెందిన నిపుణులనుంచి, బాధ్యతాయుతంగా మెలుగుతున్న కోట్లాది పౌరుల వరకు దేశ సమగ్రతను కాపాడుతున్నారు. భారత దేశంలో కరోనా తీవ్రత బలహీనంగా ఉండటానికి వీటితో పాటు మన జీవన విధానం (ధూప దీపాలు, మామిడి తోరణాలు, సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ), ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు (పసుపు, వెల్లుల్లి, మసాలా దినుసుల వాడకం, కాయగూరల వినియోగం) ద్వారా మెరుగైన వ్యాధినిరోధక శక్తి పెంపొందించటం కూడా కారణాలు.

వీటికి తోడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటంలో మన వైఫల్యం కూడా మనకి కలిసి వచ్చింది. ఎంతో మంది భారతీయులు మలేరియా వంటి వ్యాధి వ్యాపించే ఊళ్లలో ఉండటం, వారికి టీకాలు ఇవ్వటం వలన వారికి కరోనా సోకే అవకాశాలు తగ్గాయి.

ఇక్కడి వరకు అంతా బాగుంది, ఆనందకరమైన, గర్వించ దగిన విషయం. ఇక మిగిలిన దేశాల విషయానికి వస్తే, అమెరికా, చైనా, ఇటలీ వంటి దేశాలు వారి పరిధిలో వారు ఈ మహమ్మారితో పోరాటం చేస్తున్నారు. సమయానికి స్పందించని ఇటలీ భారీ మూల్యం చెల్లించింది. అమెరికా పరిస్థితి మరింత క్లిష్టమైనది. అక్కడి ప్రభుత్వ నిర్ణయాల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ఏది సరైన నిర్ణయమో కాలం నిర్ణయిస్తుంది. ఈ రోజుకి (ఏప్రిల్ 12) అమెరికా లో 5 లక్షల పైచిలుకు పౌరులు వ్యాధిగ్రస్తులైనారు. అదే భారత దేశంలో 8 వేల మందికి మాత్రమే సోకింది. అమెరికా లో కరోనా వ్యాధి ఈ స్థాయిలో వ్యాపించటానికి కారణాలు 1) భారీ అంతర్జాతీయ రాకపోకలు 2) మలేరియా లాంటి వ్యాధులను ఎప్పుడో అరికట్టడం వలన వాటికి సంబంధించిన వ్యాధినిరోధక శక్తి కొన్ని తరాలుగా క్షీణించటం 3) ప్రభుత్వం, ప్రజలు సరైన సమయంలో స్పందించక పోవటం. ఇంకా ఎన్నో.

ఇపుడు బాధ్యత గలిగిన భారతీయులు చేయాల్సినది ఏమిటి? అమెరికాని చూసి అవహేళన చేయటమా లేక మన పరిస్థితి బాగున్నందుకు తృప్తి పడటమా?

ఇప్పటికీ అమలవుతున్న అంటరాని తనం, కుల వ్యవస్థ, అవినీతిమయ రాజకీయ వ్యవస్థ, దానికి పూర్తిగా అలవాటు పడిపోయిన పౌరులు, మన కులం వాడు కాబట్టి అసమర్థుడైనా కూడా ఓటు వేసే సగటు భారతీయులు, డబ్బు, మందులకు ఓటు హక్కుని అమ్ముకునే ఓటర్లు, దేశాభివృద్ధికి మూలమైన పారిశ్రామికీకరణ గురించి ఆలోచన చేయని మేధావులు, అడుగంటుతున్న వ్యవసాయానికి చేయూతనివ్వని ప్రభుత్వాలు, 130 కోట్లమందిలో గుప్పెడు ఒలింపిక్ పతకాలు కూడా గెలవలేని నపుంసక వ్యవస్థలు… ఇంకో ఎన్నో అంశాలలో మన వెనకబాటుతనాన్ని కప్పిపుచ్చుకుంటూ ఇతరదేశాల ప్రస్తుత వైఫల్యాన్ని ఎగతాళి చేయటం, అర్ధ సత్యాలని ప్రసారం చేయటం వలన జరిగేది నష్టమే తప్ప, ఎవ్వరు దానిని హర్షించరు. ఒక విషయానికే మిడిసిపాటు యోగ లక్షణం కాదు.

సర్వేజనః సుఖినోభవంతు

నల్లం చంద్ర శేఖర్
బోస్టన్, అమెరికా