శ్మశానాని తలపిస్తున్న న్యూయార్క్‌ నగరం.. ఎటు చూసిన గుట్టల గుట్టల శవాలు..!!

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ మహమ్మారికి హాట్ స్పాట్ గా మారింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ నగరం విలవిలలాడుతోంది. కరోనా బాధితులు పెరిగిపోవడంతో మిలటరీ వైద్యులు కూడా ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యం అందించాల్సిన పరిస్థితి వచ్చింది. 2011లో న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌కు చెందిన ట్విన్‌ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతుచెందిన వారి సంఖ్యను ఒక్క న్యూయార్క్‌లో కరోనా మృతుల సంఖ్య దాటిపోయింది. నాటి దాడిలో మొత్తం 2,977 మంది అమెరికా పౌరులు చనిపోగా, వారిలో 2,753 మంది న్యూయార్క్‌వాసులే ఉన్నారు. కానీ, మంగళవారం నాటికి ఈ ఒక్క నగరంలోనే 6,268 మందిని కరోనా బలిగొంది. ఒక్క రోజులోనే న్యూయార్క్‌లో 779 మంది మృత్యువాతపడ్డారు. కరోనా ఉత్పాతం విరుచుకుపడిన ఈ 3, 4 నెలల్లో ఒక్క రోజులోనే ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఇంతమందిని సమాధి చేయడానికి శ్మశానవాటికల్లో చోటు చాలడం లేదని, ఒక్కో మృతదేహం సమాధికి తొమ్మిది నుంచి పది రోజులు పడుతోందని, బ్రూక్లిన్ ఆసుపత్రి ప్రస్తుతం శవాల దిబ్బగా మారిందని, మార్చురీలలో శవాలను పెట్టేందుకు ఖాళీ లేక ఆసుపత్రి బయటే శవాలు గుట్టలుగా పడి ఉన్నాయని, రోడ్ల పక్కనే చిన్న టెంట్లు ఏర్పాటు చేసి వాటిని మొబైల్ మార్చురీలుగా మార్చుతున్నారని ఆసుపత్రి ఎదుటే నివాసముంటున్న అలిక్స్‌ మొంటెలీయోన్‌ తెలిపారు.