అమెరికాలో ఆగని మృత్యుకేళి.. 11 మంది ఇండియన్స్ మృతి..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో కరోనా వీర విహారం చేస్తుంది. కరోనా మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 14 వేలమందికి పైగా మృతి చెందారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 2 వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా ఎఫెక్ట్‌ అమెరికాలో ఉంటున్న భార‌తీయులపై కూడా పడింది. క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో భార‌తీయుల్లో కూడా చాలామంది ఆ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. అయితే.. ఇందులో ప‌లువురు క‌రోనా బారిన‌ప‌డి చ‌నిపోయినట్లు తెలుస్తోంది. మ‌రికొంద‌రు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 11 మంది భారతీయులు కరోనాతో చనిపోయినట్లు సమాచారం. వీరిలో 10 మంది న్యూయార్క్‌, న్యూజెర్సీ నగరాలకి చెందిన వారు కాగా, ఒక్కరు ఫ్లోరిడాలో నివాసం ఉంటన్న వ్యక్తిగా అధికారులు గుర్తించారు. మృతుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్ల‌ని తెలిసింది. ఇదిలావుంటే న‌లుగురు మ‌హిళ‌లు స‌హా మరో 16 మంది భారతీయులు క‌రోనా ల‌క్ష‌ణాల‌తో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. కఠిన నిబంధనలు అమలులో ఉండడం వల్ల మరణించిన భారతీయుల అంత్య‌క్రియ‌ల‌ను స్థానిక అధికారులే చేప‌డుతున్నారు. కుటుంబ స‌భ్యుల‌ను కూడా అనుమ‌తించ‌డం లేదని అధికారులు చెబుతున్నారు.