రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షం..వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయంటున్న వైద్యులు

వాస్తవం ప్రతినిధి: కరోనా రక్కసి కోరలు చాస్తున్న వేళ ప్రకృతి కోపగించింది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులతో కూడిన వర్షంతో విరుచుకు పడింది. ఈ వాతావరణంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దోంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టిందని,మరి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయని భావిస్తున్న తరుణంలో వర్షం పిడుగులా వచ్చిందని ఆందోళన వ్యక్తమౌతున్నది.

నెల్లూరు జిల్లాలో అకస్మాత్తుగా అంతా ఆకాశంలో మేఘలు కమ్మేసాయి. చాలా చోట్ల చిరు జల్లులు నుండి భారీ వర్షాలు పడ్డాయి. దీని ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వ్యాధులు ముసిరే అవకాశాలు ఎక్కువయ్యాయి. సాధారణ జ్వరాలు, జలుబు, దగ్గు ఈ వాతావరణం లో పెరుగుతాయి.అయితే ఇదే సమయంలో కరోనా అనుమానం పెరిగితే ప్రజల కష్టాలు ఎక్కువ అవుతాయి. మరో వైపు పారిశుద్ధ్య సమస్యలు అధికమవుతాయి.

వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే తరుణం ఇది. కోతలు కోసే వేళలో వర్షాలు కురిస్తే వరి పనులు పూర్తి తడిసి ముద్ద అవుతాయి. రంగు మరి ధాన్యం ఎందుకూ పనికి రాకుండా పోతుంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందని రైతాంగం కంట నీరు పెడుతున్నారు.