తనను నిజంగా ప్రేమించేవారు ఉంటే ఇలా చేయండి అంటున్న మోదీ

వాస్తవం ప్రతినిధి: దేశంలో గంటగంటకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 5360 కి చేరుకున్న కరోనా కేసుల సంఖ్య తెల్లారేసరికి మారిపోతోంది.  ఈ నేపధ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఎన్నో చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా స్ప్రెడ్ అవ్వకుండా.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారు. అధికారులతో, అన్ని రాష్ట్రాల సీఎంలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. తగిన చర్యలు తీసుకుంటున్నారు.

అయితే ఈక్రమంలో కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన రెండు కార్యక్రమాల్ని దేశ ప్రజలంతా విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మళ్లీ ఏ టాస్క్ ఇస్తారో అని దేశ ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కరోనాను కట్టడి ఎంతో శ్రమిస్తున్న మోదీకి ప్రజలంతా కృతజ్ఞత చెప్పాలంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నెల 12వ తేదీ అనగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఐదు నిమిషాల పాటు ప్రజలంతా ఇంటి బాల్కనీల్లో నిలబడి ప్రధాని మోదీకి సెల్యూట్ చేయాలని కొందరు అభిమానులు పిలుపునిచ్చారు. దానికి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

కాగా.. ఈ విషయం కాస్తా ప్రధానమంత్రి దృష్టికి వెళ్లింది. దానిపై స్పదించిన మోదీ తనను నిజంగా ప్రేమించేవారు ఉంటే ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని..అదే మీరు నాకు ఇచ్చే సెల్యూట్ అని ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ కాకుండా ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని మోదీ విజ్ఞప్తి చేశారు.