అవి ట్రంప్ కు అవ‌స‌ర‌మేమో గానీ.. జ‌గ‌న్ కి కాదు: రోజా

వాస్తవం ప్రతినిధి: జగన్ కరోనా కట్టడికి తీసుకుంటున్న నిర్ణయల పై చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు గాను వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీఐఐసీ చైర్‌పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో క‌రోనా ఉదృతి పెరిగిపోతుంటే చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో ఉంటూ ఆంధ్ర నుంచి ఆమెరికా వ‌ర‌కు స‌ల‌హాలు ఇస్తున్నారని అన్నారు. అయితే చంద్రబాబు సలహాలు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అవ‌స‌ర‌మేమో గానీ, సీఎం జ‌గ‌న్ కు అవ‌స‌రం లేద‌ని ఎద్దేవా చేశారు. కరోనా కట్టడికి ఏపీ సీఎం జగన్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారన్నారని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా జగన్‌ దేశానికే ఆదర్శంగా పరిపాలన అందిస్తున్నారని.. జగన్‌ ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ అభినందనీయం అంటున్నారు. విదేశాలు, పొరుగు రాష్ట్రాలు, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని గుర్తించడంలో వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పని చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ల్యాబ్స్ పెట్టి కరోనా కట్టడి చేస్తున్నారని.. అలాగే కరోనాను ఆరోగ్యశ్రీ కింద చేరుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఏడు వైరస్ ల్యాబ్స్ పెట్టి కరోనా వ్యాధిని కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు.