యోగి సర్కార్ కీలక నిర్ణయం !

వాస్తవం ప్రతినిధి: ఉత్తరప్రదేశ్ నుంచి 1600 మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నట్టు గుర్తించిన ప్రభుత్వం 1200 మందిని క్వారంటైన్ చేసింది. కాగా, రాష్ట్రంలో ప్రతి రోజు కరోనా కేసులు నమోదవుతుండడం,అలాగే కరోనా కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లోని మొత్తం 15 జిల్లాలను ఈ నెల 13 వరకు పూర్తిగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిత్యావసరాలకు ఇబ్బంది కలగకుండా ప్రజల ఇళ్ల వద్దకే వాటిని చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్టు యూపీ చీఫ్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ తివారీ ట్వీట్ చేశారు.

రాష్ట్రంలోని లక్నో, ఆగ్రా, ఘజియాబాద్, గౌతంబుద్ధ్‌నగర్ (నోయిడా), కాన్పూర్, వారణాసి, షామ్లి, మీరట్, బరేలీ, బులంద్‌షహర్, ఫిరోజాబాద్, మహారాజ్‌గంజ్, సీతాపూర్, షహరాన్‌పూర్, బస్తీ జిల్లాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారడంతో యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మూసివేత నిర్ణయంపై తిరిగి 13న సమీక్ష నిర్వహిస్తామని రాజేంద్రకుమార్ పేర్కొన్నారు.

బుధవారం నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 326కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 37 జిల్లాల నుంచి కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో 166 తబ్లిగీ జమాత్‌తో లింక్ ఉన్నవే కావడం గమనార్హం.