నేడు హనుమాన్ జయంతి..భక్తులు లేక వెలవెలబోయిన ఆలయాలు!

వాస్తవం ప్రతినిధి: నేడు హనుమాన్ జయంతి. కరోనా మహమ్మారి కారణంగా భక్తుల తాకిడి లేక ఆలయాల్లో సందడి వాతావరణం కనిపించలేదు.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొండగట్టు అంజన్న ఆలయం బోసిపోయింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి యేటా ఇక్కడికి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం అంజన్న మాల దీక్ష విరమణ చేస్తారు.

అయితే, ఈసారి మాత్రం జయంతి వేడుకలు చాలా సాదాసీదాగా జరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా భక్తులెవరూ ఆలయ సందర్శనకు వెళ్లకుండా అధికారులు ప్రధాన రహదారిని మూసివేశారు. దీంతో ఆలయానికి వచ్చిన కొంతమంది సమక్షంలోనే వేడుకలు నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకలు ఇంత సాధారణంగా జరగడం గత రెండున్నర దశాబ్దాల్లో ఇదే తొలిసారి.