కువైట్ లోని కరోనా బాధితుల్లో భారతీయ కార్మికులే ఎక్కువట..!!

వాస్తవం ప్రతినిధి: గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన ప్రవాస భారతీయులకూ కరోనా కష్టాలు తప్పడం లేదు. దుబాయ్‌, కువైత్‌, బహ్రెయిన్‌, ఖతర్‌, సౌదీ అరేబియా తదితర దేశాల్లో స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ వైరస్‌ సోకుతోంది. దీనికి ప్రధాన కారణం అక్కడి లేబర్‌ క్యాంపుల్లోని ఇరుకైన గదులేనని అధికారులు గుర్తించారు. విదేశీ కార్మికులు నివసించే ఈ క్యాంపుల్లో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని నిర్ధారణకు వచ్చారు. దుబాయ్‌లో అల్‌రాస్‌, నాయిఫ్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయ ఉద్యోగుల్లో చాలా మందికి పాజిటివ్‌ రావడంతో వీరిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఖతర్‌లోనూ తెలుగు కార్మికులు భారీ సంఖ్యలో నివసిస్తున్న సనయ్యా ప్రాంతంలో పూర్తి దిగ్బంధం కొనసాగుతోంది. కువైత్‌లోని కరోనా బాధితుల్లో భారతీయ కార్మికులే ఎక్కువగా ఉండటంతో కువైతీలు కన్నెర్ర చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు ఎక్కువగా నివసిస్తున్న మహెబులా ప్రాంతాన్ని కువైత్‌ సైన్యం దిగ్బంధం చేసింది.