అగ్రరాజ్యంలో అవస్ధలు.. అమెరికాలో తెలుగోళ్ల కష్టాలు..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో వీర విహారం చేస్తున్న క‌రోనావైర‌స్ ఇప్ప‌టికే 12వేల‌కు పైగా మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. దేశ‌వ్యాప్తంగా 4ల‌క్ష‌ల క‌రోనా బాధితులున్నారు. న్యూయార్క్ న‌గ‌రం ప‌రిస్థితి వ‌ర్ణ‌ణాతీతం. ఒక్క న్యూయార్క్ న‌గరంలోనే 1,40,386 మంది ‘కొవిడ్‌-19’ బారిన ప‌డ‌గా, 5,489 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో ఈ న‌గ‌ర ప్ర‌జ‌లు ఈ మ‌హ‌మ్మారి కోర‌ల్లో చిక్కుకుని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. అయితే, అమెరికాలోని భారత జాతీయులు కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు జంకుతున్నారు. విధిలేని పరిస్థితిలో నిత్యావసర వస్తువులకు బయటకు వెళ్లిన ప్రతి ఇద్దరిలో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. సుమారు 100 మంది దాకా భారత జాతీయులు ఈ వ్యాధి బారిన పడి మరణించి ఉంటారని అమెరికాలో భారత సంఘాలు చెబుతున్నాయి. కానీ, అమెరికాలో భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీస శ్రద్ధ పెట్టడం లేదని భారతీయులు వాపోతున్నారు. న్యూజెర్సీలో భారతీయులు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను నెల రోజులు వాడకునేందుకు వీలుగా పొదుపు చేసుకుంటున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారు కమ్యూనిటీలుగా ఏర్పడి వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.