కరోనా కాటుకు .. సినీయర్ జ‌ర్న‌లిస్ట్ మృతి..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి మారణహోమానికి పలువురు భారతీయ సంతతికి చెందిన వారు కూడా బలవుతున్నారు. తాజాగా భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు న్యూయార్క్ న‌గరంలో క‌రోనాతో చ‌నిపోయారు. యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో క‌రెస్పాండెంట్‌గా ప‌ని చేస్తున్న బ్రహ్మ కంచిబోట్ల(66) అనే పాత్రికేయుడు క‌రోనా సోకడంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉద‌యం చ‌నిపోయారు. కరోనా లక్షణాలతో మార్చి 23న ఆయన ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి మరింత విషమించడంతో లాంగ్ ఐలాండ్‌లోని ఆసుపత్రిలో వెంటిలేటర్‌ పై ఉంచి చికిత్స అందించారు. ఆసుపత్రిలో తొమ్మిది రోజుల పోరాటం అనంతరం సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. యూఎస్‌లో 28 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొన‌సాగుతున్న ఆయ‌న చివ‌ర‌కు క‌రోనా కాటుకు బ‌లి అయ్యారు. బ్ర‌హ్మ కుమారుడు సుడామా కంచిబోట్ల మాట్లాడుతూ ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో నెల‌కొన్న విప‌త్క‌ర పరిస్థితుల దృష్ట్యా తండ్రి ఆఖ‌రి చూపుకు నోచుకుంటామో లేదో అని వాపోయాడు. తండ్రి మృత‌దేహాన్ని అంత్య‌క్రియ‌ల కోసం ఇస్తార‌నే న‌మ్మ‌కం కూడా లేద‌న్నాడు. ఆయన మృతిపట్ల పలువురు జర్నలిస్టులు, అమెరికా తెలుగు సంఘాలు సంతాపాన్ని ప్రకటించాయి.