మీడియాపై రోహిత్‌ ఫైర్

వాస్తవం ప్రతినిధి: మీడియాపై టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌కెప్టెన్ రోహిత్‌ శర్మ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఉద్యోగంలో భాగంగా ఆటగాళ్లపై కథనాలు రాసేముందు ఒక్కసారి ఆలోచించాలని ‘హిట్‌మ్యాన్’ సూచించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో సరిగ్గా రాణించకపోతే ఆటగాళ్లను జట్టులో నుంచి తప్పించాలనే అభిప్రాయానికి ఎలా వస్తారని రోహిత్‌ అభిమానులను ప్రశ్నించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌తో రోహిత్‌ శర్మ మంగళవారం ముచ్చటించాడు.

హిట్‌మ్యాన్ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడుతూ మీడియా, అభిమానులపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసాడు. ‘పలానా ఆటగాడు రాణించట్లేదు.. అతడిని జట్టు నుంచి తప్పించండి అని కొందరు అంటుంటారు. కానీ ఇక్కడ మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి జట్టు కూడా విజయం కోసమే పోరాడుతుంది. అందరూ ఆటగాళ్లు తాను బాగా ఆడాలని, జట్టు గెలవాలనే కోరుకుంటారు. నేను కూడా ప్రతిసారి బాగా ఆడాలనుకుంటా. కొన్నిసార్లు అది సాధ్యం కాదు. జట్టులో ఆటగాళ్ల చోటు గురించి అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. మీరు క్రికెట్‌ను ఆస్వాందించండి’ అని రోహిత్ అన్నాడు.

‘మేం కొన్ని మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసి ఉండొచ్చు. కానీ.. పరాజయాల కంటే విజయాలు ఎక్కువగా సాధిస్తున్నాం’ అని అభిమానులను ఉద్దేశించి హిట్‌మ్యాన్‌ అన్నాడు. ‘యువ ఆటగాళ్లకు సూచనలు, సలహాలు ఇస్తుంటా. రిషభ్‌ పంత్‌తో ఎక్కువగా మాట్లాడాను. అతడికి 20 ఏళ్లు మాత్రమే. అందరూ అతడిపైనే దృష్టి సారించడంతో ఒత్తిడికి గురవుతున్నాడు. ఉద్యోగంలో భాగంగా ఆటగాళ్లపై కథనాలు రాయాలని మీడియా భావిస్తుంటుంది. అయితే రాసేముందు ఒక్కసారి ఆలోచించాలి. అది ఎంతో ప్రభావితం చూపిస్తాయి’ అని రోహిత్ పేర్కొన్నాడు.