ధోనీ కెప్టెన్సీలో అతని అద్భుత పోరాటం మనందరికి తెలిసిందే: నెహ్రా  

వాస్తవం ప్రతినిధి: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎప్పటికీ తన అత్యుత్తమ కెప్టెన్ సౌరవ్ గంగూలీనేనని తెలిపాడు. దాదా ఇచ్చిన సపోర్ట్.. ధోనీ, కోహ్లీ నాయకత్వాల్లో లభించలేదని పేర్కొన్నాడు.

అయితే తాజాగా ఈ సిక్సర్ల సింగ్ సహచర ఆటగాడు, భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా మాత్రం ధోనీ కెప్టెన్సీలోనే యువరాజ్ ఓ వెలుగు వెలిగాడని చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ హిందీ చానెల్ నిర్వహించిన క్రికెట్ కనెక్టెడ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఈ మాజీ పేసర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

‘నేను చూసినంత వరకు ధోనీ సారథ్యంలోనే యువరాజ్ అద్భుతంగా ఆడాడు. 2007, 2008లో అతను విధ్వంకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 2011 ప్రపంచకప్‌లో అనారోగ్యానికి గురైనా.. అతని అద్భుత పోరాటం మనందరికి తెలిసిందే. ఇవన్నీ ధోనీ కెప్టెన్సీలోనే జరగాయి. ఇక ఫేవర్ కెప్టెన్ ఎవరనే విషయంలో ప్రతీ ప్లేయర్‌కు ఓ చాయిస్ ఉంటుందనేది నా ఫీలింగ్. కానీ నా వరకు మాత్రం యువరాజ్ తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ధోనీ కెప్టెన్సీలోనే బాగా ఆడాడు. ‘అని నెహ్రా చెప్పుకొచ్చాడు.