భయపడిపోతున్న విశాఖపట్నం..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మర్కజ్ మత ప్రార్థనల ఘటన ఏపీలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అధికారుల అంచనాలను తలకిందులు చేసింది. ఇదిలా ఉండగా తాజాగా విశాఖలో ఓ సంఘటన బయటపడటంతో…విశాఖ పట్టణం అంతా ఇప్పుడు భయపడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా గాజువాక లో ఒక చికెన్ వ్యాపారికి పాజిటివ్ అని తేలడంతో విశాఖలో టెన్షన్ నెలకొంది. వ్యాపారి దగ్గర ఇటీవల నమూనాలు సేకరించి అనంతరం అధికారులు హోమ్‌ క్వారంటైన్‌ అని చెప్పి పంపించేశారు. దీనితో ఆ వ్యాపారి తిరిగి మళ్ళీ వ్యాపారం యధావిధిగా చేస్తున్నారు. అయితే తాజాగా ఆ వ్యాపారి రిపోర్ట్స్‌లో కరోనా పాజిటివ్ అని తేలగానే అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వ్యాపారి చికెన్ అమ్మినట్టు గుర్తించిన అధికారులు అతడి దగ్గర చికెన్ కొనుగోలు చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 14 మందిని గుర్తించిన అధికారులు వారందరి నమూనాలు సేకరించి అందరిని క్వారంటైన్‌లో ఉంచారు. ఇప్పుడు విశాఖపట్టణం లో ఈ వార్త పెద్ద హైలెట్ గా మారింది.