లాక్‌డౌన్‌ పొడిగింపు అంశంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగింపు అంశం పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయని, లాక్‌డౌన్‌ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ మేధావులతో మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ విపత్కర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించాలన్న విషయంపై కేంద్రప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ విషయంపై ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు అని తెలిపారు. కరోనాను లాక్ డౌన్ ద్వారా మాత్రమే అరికట్టగలం అని ప్రజలంతా దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనవసరమైన కారణాలతో రోడ్డుపై తిరగొద్దని సూచించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర లాక్ డౌన్ ను అమలు చేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా ఆహార కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.