వైద్య, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: తమ ప్రాణాలను పణంగా పెట్టి మన ప్రాణాలు కాపాడడానికి వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు శిరసా నమామి అంటూ వ్యాఖ్యానించారు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్ చేశారు.. వైద్యులకు, నర్సులకు, ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నియంత్రణపై ప్రపంచం అంతా తల్లడిల్లుతోందని, ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజారోగ్యం ప్రపంచవ్యాప్తంగా పెనుప్రమాదంలో పడిందని, ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించడం అందరి విధి అని చంద్రబాబు సూచించారు. వైరస్ కట్టడికి చేస్తున్న కృషిలో అందరం భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. సెల్ఫ్ క్వారంటైన్ తో మన ప్రాణాలు కాపాడుకోవడమే కాదు, మన కుటుంబం, మన సమాజం ఆరోగ్యాన్ని కూడా కాపాడుదాం అంటూ పేర్కొన్నారు.