కరోనా కట్టడికై కేంద్రం మరో కీలక నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు మోదీ సర్కారు లాక్‌డౌన్ విధించి అమలు చేస్తోంది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. కరోనా వైరస్‌పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా పార్లమెంటు సభ్యులందరి వేతనంలో సంవత్సరం పాటు 30% కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు సోమవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సంఘటిత నిధిలో చేరే ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటంలో వినియోగించనున్నారు. ఈ మేరకు ‘శాలరీ, అలవెన్సెస్‌ అండ్‌ పెన్షన్‌ ఆఫ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ యాక్ట్‌–1954’కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ రూపొందించామని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు.

ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఏడాదిపాటు ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు, మాజీ ఎంపీల పెన్షన్లను 30 శాతం తగ్గించారు. ఈ ఆర్డినెన్స్‌తోపాటు ప్రధాని, మంత్రులతోపాటు.. ఎంపీలు, ఎమ్మెల్యేల వేతనాల్లోనూ కోత పడనుంది.