కరోనాపై పోరుకు టీటీడీ భారీ విరాళం

వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారి రోజు రోజు కీ విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో కరోనాపై పోరాటానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ విరాళం అందజేసింది. టీటీడీ తరఫున రూ. 19 కోట్లు ఏపీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికే రూ.8కోట్లు చిత్తూరు జిల్లా అధికారులకు ఇచ్చామని, మరో రూ.11 కోట్లను త్వరలో ఏపీ ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు.

అటు.. తిరుమలపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని భక్తులను కోరారు. దర్శనం మాత్రమే ఆపేశామని.. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారికి జరగాల్సిన అన్ని పూజలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఆదివారం నాడు శ్రీవారికి వసంతోత్సవం కూడా జరిగిందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, వలస కూలీలు, యాచకులను ఆదుకునేందుకు రోజుకు లక్షా 20 వేల ఫుడ్ ప్యాకెట్లను టీటీడీ పంపిణీ చేస్తోంది. తిరుమల విశ్రాంతి గృహాల్లోనూ ఆశ్రయం కల్పిస్తోంది.