కరోనా మానవ జాతికి ఓ హెచ్చరిక..శుభ్రంగా ఉండాలని ప్రకృతి హెచ్చరిస్తోంది: జేసీ

వాస్తవం ప్రతినిధి: కరోనా మానవ జాతికి ఓ హెచ్చరిక అని.. శుభ్రంగా ఉండాలని ప్రకృతి హెచ్చరిస్తోందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.ఈ కరోనా టైంలో ఎంచక్కా అనంతపురం జిల్లాలోని జూటూరులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నాడు. తాజాగా ప్రబలిన కరోనా వైరస్ పై ఆయన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా రాకూడదంటే వ్యవసాయ క్షేత్రాల్లోనే ఉండాలని.. అందుకే తాను ఫాంహౌస్ కు వచ్చానని  తెలిపారు. పాపం బాగా పెరిగినప్పుడు.. ప్రకృతి దేవుడు ఇలాంటిది ఒకటి సృష్టించి జనాలను తగ్గిస్తుంటాడని.. ఇప్పుడు కూడా కరోనా వైరస్ ని సృష్టించాడని జేసీ సంచలన కామెంట్స్ చేశాడు. కరోనా వంటి కష్టమైన పరిస్థితిని తన జీవితంలో ఇప్పటివరకు చూడలేదని పేర్కొన్నారు.

ప్రతీ 100 ఏళ్లకు ఒకసారి ఇలాంటివి జరుగుతున్నాయని.. పాపం అంటే చంపడం.. నరకడం కాదని.. దుర్మార్గమైన వాతావరణాన్ని సృష్టించడమని జేసీ అన్నారు. దేవుడు ప్రకృతి తనంతట అదే కేర్ తీసుకుంటుంది అని అన్నారు. కొంత కంట్రోల్ చేయడానికి చూస్తుందన్నారు.

కరోనా నియంత్రణకు పోలీసులు డాక్టర్లు బాగా పోరాడుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు. దీన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. రాజకీయాల కోసం కరోనాను ఉపయోగించుకో వద్దన్నారు.

కరోనా విషయంలో ప్రధాని మోడీ చాలా కష్టపడుతున్నాడని.. తప్పు జరిగితే ప్రజలదే తప్పు అని.. ప్రభుత్వాలది కాదన్నారు. ఏపీ సీఎం జగన్ మాత్రం చాలా తేలికగా తీసుకుంటున్నారని జేసీ ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందని జగన్ చెప్పారని.. జగన్ తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తనకు తెలియదని జేసీ ఆరోపించారు.