పెద్ద ఎత్తున కాకుల మృతి.. కరోనా నే కారణమా.??

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ కారణంగా ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో పెద్ద ఎత్తున కాకులు మరణిస్తున్నాయి. ఈ ఘటన తమిళనాడులోని పనపాక్కం సమీపంలో చోటు చేసుకుంది. ఇలా కాకులు పెద్దఎత్తున మరణిస్తూ ఉండటంతో కారణాన్ని కనుగొనేందుకు ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడికి సమీపంలోని పన్నియార్ గ్రామంలోని కులత్తుమేడు ప్రాంతంలో ఈ నెల 1న దాదాపు 10కి పైగా కాకులు మరణించి కనిపించాయి. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ప్రజలు బయటకు రాకపోవడంతో ఆహారం లేక కాకులు మరణించి వుంటాయని తొలుత భావించారు. ఆపై నిత్యమూ నివాస గృహాలపై నీరసంగా కనిపిస్తున్న కాకులు, ఒకదాని తరువాత ఒకటి అకస్మాత్తుగా మరణిస్తూ ఉండటం, మృతి చెందిన కాకుల సంఖ్య ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కాకులకు కరోనా వైరస్ సోకిందని, అందుకే ఇవి మరణిస్తున్నాయని మరికొందరు భయపడుతున్నారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారుల బృందం, కాకుల మరణానికి కారణాన్ని అన్వేషించేందుకు రంగంలోకి దిగింది. వీటి మృతి వెనుక ఆకలి బాధే కారణమా.. లేక మరేదైనా కారణం ఉందా.. అనే విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.