పెంపుడు జంతువుల యజమానులారా..తస్మాత్ జాగ్రత్త!

వాస్తవం ప్రతినిధి: భయంకర కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపిస్తుందని ఇంతకాలం అనుకుంటూ వచ్చాం.. కానీ ఇది తప్పని తేలిపోయింది. కరోనా వైరస్  జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందనడానికి ఆధారాలు లేవని, కానీ పెంపుడు జంతువుల యజమానుల నుంచి వాటికి ఇది సోకుతుందని నమ్మవలసి వస్తోందని జంతు నిపుణులు అంటున్నారు.   కాబట్టి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మీ కారణంగా మీ పెంపుడు జంతువులు బలైపోవడం ఖాయమని చెబుతున్నారు.

ఉదాహరణకు బెల్జియంలో ఒక పిల్లికి, హాంకాంగ్ లో రెండు శునకాలకు వాటి యజమానుల నుంచి కరోనా వైరస్ సోకిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. అయితే చైనాలోని వూహాన్ సిటీలో జంతు మార్కెట్ సంగతి వేరని వారు పేర్కొంటున్నారు.

న్యూయార్క్ లోని బ్రాంక్స్ జూ లో నాలుగేళ్ల వయసున్న ఓ మగ పులికి, దీంతో బాటు ఆ తరువాత పుట్టిన ఆడ పులికి, మరో మూడు పులులతో బాటు మూడు ఆఫ్రికన్ సింహాలకు సైతం కరోనా వైరస్ సోకిందట. ఇవి పొడి పొడిగా దగ్గుతుండడంతో ఈ విషయం బయటపడింది. రోజూ వీటి బాగోగులు చూసే వీటి కేర్ టేకర్ ద్వారా ఈ జంతువులకు ఇది సంక్రమించిందని వైల్డ్ లైఫ్ సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ జంతువులకు ప్రాణాపాయం లేదని, త్వరలో ఈ వైరస్ బారి నుంచి బయటపడతాయని భావిస్తున్నట్టు ఈ సంస్థ పేర్కొంది.