మద్యం దొరక్క అది తాగి ఆరుగురు మృతి !

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్‌లో కరోనా లాక్‌డౌన్ కారణంగా కల్లు దుకాణాలు బంద్ అవ్వడంతో… పిచ్చెక్కినట్లు అయిపోతూ… ఏదేదో తమలో తామే మాట్లాడుకుంటూ… వింతగా ప్రవర్తిస్తున్న 1000 మందికిపైగా వ్యక్తులను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే… తమిళనాడులో ప్రాణాలే పోతున్నాయి .

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యానికి బానిసైనవారు మతి చెడినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మత్తు కోసం ఏవేవో పుకార్లు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కూల్‌ డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌ కలుపుకొని తాగడంతో నాలుగు రోజుల క్రితం కేరళలో ఓ వ్యక్తి మరణించిన ఘటన మరువకముందే..

తమిళనాడులోనూ అలాంటి విషాదమే వెలుగు చూసింది. పుదుకొట్టై జిల్లాలోని ఇద్దరు మత్స్యకార యువకులు కూల్‌ డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌ కలుపుకొని తాగడంతో ప్రాణాలు విడిచారు. మరొకరు ఆస్పత్రిలో విషమ స్థితిలో ఉన్నారు. మరో ముగ్గురు కూడా ఇలాగే మొత్తం ఆరుగురు చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

మద్యానికి అలవాటు పడిన వారికి… పెయింట్ వార్నిషింగ్, షేవింగ్ లోషన్ వంటి వాటి వాసన బాగా నచ్చుతుంది. అందుకే వారు వాటిని నీటిలో, కూల్ డ్రింక్స్‌లో కలుపుకొని… అదే మద్యంలా ఫీలవుతూ తాగుతున్నారు. ఇది భయంకర పరిణామం. ఒక రకంగా విషాన్ని తాగుతున్నట్లే. ఎవరైనా మద్యం దొరక్క వింతగా ప్రవర్తిస్తుంటే… వెంటనే వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్తే… మందుల ద్వారా నయం చేస్తామంటున్నారు డాక్టర్లు.