ప్రజలు నన్ను క్షమించాలి: మోదీ

వాస్తవం ప్రతినిధి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతున్నారు. కరోనాపై పోరులో భాగంగా లాక్‌డౌన్‌ వంటి అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనను క్షమించాలని వ్యాఖ్యానించారు. తనపై కొందరు ఆగ్రహంతో ఉన్నారని తనకు తెలుసని అన్నారు. అయినప్పటికీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ కఠిన చర్యలు తీసుకోకతప్పదని చెప్పారు.

కరోనాను ఓడించాలంటే ప్రజా సంయమనానికి మించిన ఆయుధం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రజా సహకారం అంత్యంత కీలకమన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలంతా లాక్ డౌన్ ను తప్పని సరిగా పాటించాలన్నారు. కరోనాపై పోరులో మనం గెలిచి తీరాలన్నారు. ప్రజలను, దేశాన్ని కాపాడుకోవాలంటే కరోనాపై విజయం సాధించి తీరాలనీ, అందుకోసం ప్రజలంతా నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని మోడీ విజ్ణప్తి చేశారు. ప్రజల రక్షణ కోసమే దేశ వ్యాప్త లాకౌట్ ప్రకటించినట్లు చెప్పిన ఆయన జనం లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే తమకు తాము హాని చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా హాని చేసిన వారౌతారని పేర్కొన్నారు.

ముఖ్యంగా పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నది జీవన్మరణ సమస్య అయినందువల్లే కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన రోజుల్లో చర్యలు తీసుకుంటేనే కరోనాను తొలగించవచ్చని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే దేశ ప్రజలు కొన్ని రోజులు లక్ష్మణ రేఖ దాటొద్దని వ్యాఖ్యానించారు.