తిరుమలలో సంచరిస్తున్న చిరుతలు – ఎలుగులు

వాస్తవం ప్రతినిధి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శనార్దం తిరుమలకు నిత్యం భక్త జనం వస్తుంటారు. ఇప్పుడు కరోనా కారణంగా తిరుమలకు రావద్దంటూ టీటీడి ఆధికారుల ఆదేశాల నేపధ్యంలో భక్తుల రాక ఆగిపోయింది. దీంతో తిరుమల లో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి.

తిరుమలలో జనసంచారం లేకపోవడంతో పులులు ఎలుగుబంట్లు వంటి జంతు సంచారం పెరిగింది. రాత్రి సమయాల్లో చిరుతలు – ఎలుగులు రోడ్ల మీద సంచరిస్తున్నాయి. సోమవారం రాత్రి లింక్ రోడ్డు – కళ్యాణ వేదిక – ముల్లగుంటలో చిరుతలు సంచరించాయి. నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఎలుగుబంటి సంచరించింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.

 శేషాచలం కొండల్లోని తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో 2280 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. 25 చ.అ. కిలో మీటర్ల మేర అటవీ ప్రాంతం ఎన్నో రకాల జంతువులతో కలిగి ఉంటుంది.

అటవీ ప్రాంతం కావడంతో సాధారణ సమయంలోను రాత్రి 11 నుండి వేకువజామున 4 గంటల వరకు బైక్ లకు – రాత్రి 12 నుండి 2 గంటల వరకు మిగతా వాహనాలకు అనుమతి ఉండదు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో వైకుంఠ దారిలో భక్తులు లేకపోవడంతో ఆ ప్రాంతాలకు పులులు ఎలుగుబంట్లు వస్తున్నాయి. స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు – పోలీసులు – టీటీడీ ఫారెస్ట్ రేంజర్లు సూచిస్తున్నారు.