అమెరికాని గజగజ వణికిస్తున్న కరోనా.. 24 గంటల వ్యవధిలోనే సంచలన రికార్డ్..!!

వాస్తవం ప్రతినిధి: ఇప్పటివరకు అనేక ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా.. ఇపుడు కరోనా వైరస్ ధాటికి ముప్పతిప్పలుపడుతోంది. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పాటు.. ఇతర అధికార యంత్రాంగం అంతా నిద్రహారాలు మానేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ అమెరికాలో ఈ వైరస్ బారిపడుతున్నవారితో పాటు.. మరణిస్తున్న వారి సంఖ్యకూడా పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలోనే పదివేల కొత్త కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో కోవిడ్‌ బాధితుల సంఖ్య 49,594కు చేరుకుంది. ఒకే రోజు 120 మందికిపైగా మరణించారు. దీంతో అమెరికాలో మృతుల సంఖ్య 622కి పెరిగింది. కోవిడ్‌ కల్లోలానికి ప్రపంచ వ్యాప్తంగా 16,961 మంది ప్రాణాలు కోల్పోగా, 4 లక్షల మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద సుమారు 195 దేశాలు, ప్రాంతాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి.