హంటా వైరస్ లక్షణాలు ఇవే..!!

వాస్తవం ప్రతినిధి: ఇప్పటికే చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌, ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం విదితమే. చైనాలో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టగా, ప్రపంచం ఈ వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతోంది. వందలాది మంది వేలాది మంది ఈ వైరస్‌ దెబ్బకి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో మరో భయంకరమైన వార్త వెలుగు చూసింది. దీనిపేరు హంటా వైరస్. ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. మనిషి నుంచి మనిషికి వ్యాపించదు గానీ.. గాలి ద్వారా వ్యాపిస్తుంది. హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల నుంచి సంక్రమిస్తుందని ది సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) చెబుతోంది. హెచ్‌పీఎస్‌‌లో ముందుగా అలసట, జ్వరం, కండరాల నొప్పులు(ముఖ్యంగా తొడలు, వీపు, భుజాల్లో) లక్షణాలుగా కనిపిస్తాయి. హంటా వైరస్ సోకిన వ్యక్తికి తలనొప్పి, మైకం, చలి, కడుపు నొప్పి ఎక్కువగా ఎదురవుతాయి. నాలుగు నుంచి పది రోజుల్లోపు దగ్గు, వాంతులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఈ హంటా వైరస్‌కు వ్యాక్సిన్ ఉండడం కాస్తలో కాస్త నయం అని చెప్పాలి. ఇది గాలి ద్వారా మాత్రమే సోకుతుంది. హంటా వైరస్ ఒక వ్యక్తి నుండి మరొకరికి వెళ్ళదు, కాని ఎలుకల మలం, మూత్రం మొదలైనవాటిని తాకిన తర్వాత ఎవరైనా కళ్ళు, ముక్కు, నోటిని తాకినట్లయితే హంటా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు.