నిద్ర తెచ్చిన తంట..!!

వాస్తవం ప్రతినిధి: సూక్ష్మజీవి కొవిడ్-19(కరోనా)ను నియంత్రించేందుకు ఏ దేశానికాదేశం పకడ్బందీ చర్యలను చేపడుతున్నాయి. విదేశాలకు రాకపోకలను పూర్తిగా నిలిపివేశాయి. ఇదే సమయంలో తమ సొంత దేశాలకు వెళ్లాలనుకున్న వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులు భారత్‌కు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇలా ఉంటే.. పుణెకు చెందిన అరున్‌సింగ్ అనే వ్య‌క్తి కొంత కాలంగా యూఏఈలో ఉంటున్నాడు. క‌రోనా నేప‌థ్యంలో ఇండియా వ‌చ్చేందుకు గ‌త ఆదివారం యూఏఈ విమానాశ్ర‌యానికి చేరుకున్నాడు. క‌రోనాతో దేశాల‌న్నీ అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేయ‌టంతో యూఏఈ నుంచి ఇండియాకు రావాల్సిన చివ‌రి విమానంలో అత‌డు టికెట్ బుక్ చేసుకున్నాడు. తీరా విమానం ఇండియాకు బ‌య‌లుదేరే స‌మ‌యానికి అత‌డు విమానాశ్ర‌యంలోని వెయిటింగ్ రూంలో నిద్ర‌పోయాడు. దాంతో విమానం బ‌య‌లుదేరేముందు ఇచ్చే ఫైన‌ల్ కాల్ అత‌డికి విన‌ప‌డ‌లేదు. మెల‌కువ వ‌చ్చాక అధికారుల‌ను సంప్ర‌దించ‌గా విమానం వెళ్లిపోయింద‌ని చెప్పారు. పోని యూఏఈలో ఇంటికైనా వెళ్దామంటే.. అత‌ని తాత్కాలిక వీసా కూడా ర‌ద్దు కావ‌టంతో అక్క‌డ ఉండేందుకు అనుమ‌తించ‌టం లేదట. దీంతో చేసేది ఏమి లేక మూడు రోజులుగా అరున్‌సింగ్ విమానాశ్ర‌యంలోనే ఉంటున్నాడ‌ని గ‌ల్ఫ్ న్యూస్ వార్తా సంస్థ తెలిపింది.