ఎప్పుడు.. ఎప్పుడు.. భారతదేశానికి వెళ్తామా అని ఎదురుచూపులు..!!

వాస్తవం ప్రతినిధి: ఇప్పటికే ప్రపంచం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా, చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న ఈ వైరస్.. ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. సూక్ష్మజీవి కొవిడ్-19(కరోనా)ను నియంత్రించేందుకు ఏ దేశానికాదేశం పకడ్బందీ చర్యలను చేపడుతున్నాయి. విదేశాలకు రాకపోకలను పూర్తిగా నిలిపివేశాయి. ఇదే సమయంలో తమ సొంత దేశాలకు వెళ్లాలనుకున్న వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులు భారత్‌కు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే విమానాలను నిషేధించడంతో వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులు అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఫిలిప్పీన్స్ లాక్ డౌన్ ప్రకటించింది. అయితే లాక్ డౌన్ తరువాత మరణాల సంఖ్య పెరగడంతో అక్కడున్న భారతీయులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడుంటే సమస్య మరింత తీవ్రతరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు భారతదేశానికి వెళ్తామా అని ఫిలిప్పీన్స్‌లోని మనీలా ఎయిర్‌పోర్ట్‌లో భారత విద్యార్థులు పడాగాపులు కాస్తున్నారు.