మనముందున్న ఏకైక మార్గం ఇదే.. అందరూ తప్పక పాటించండి: కోహ్లీ

వాస్తవం ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలంతా 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కట్టడికి 21 రోజులపాటు దేశాన్ని పూర్తిగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు మోదీ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వైరస్‌ విజృంభణను అరికట్టడానికి ఇంతకుమించి మార్గం లేదని స్పష్టంచేశారు.ఈ నేపథ్యంలో ప్రధాని సూచనలు పాటించాలని కోరుతూ కోహ్లీ ట్వీట్‌ చేశాడు. ‘మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్తుందని గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నా అభ్యర్థన కూడా అదే. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి’అని విరాట్‌ పేర్కొన్నాడు. అంతేకాకుండా తన సతీమణి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో కలిసి కూడా కోహ్లీ ప్రజలకు పలు సూచనలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.