నగరం మూగబోయినట్లు అనిపిస్తుంది..!!

వాస్తవం ప్రతినిధి: ప్రపంచం, దేశం మాటలకందని విలయంతో విలవిల్లాడుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఆటలకేం చోటుంటుంది? ఇప్పుడైతే దేశమే మూతపడింది. వేలకోట్లు వెచ్చించిన టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలే ఆగిపోయాయి. అయినా సరే ఐపీఎల్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాత్రం ఇంకా తేల్చకుండా… నాన్చుడు ధోరణే కనబరిచాడు. ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వూ్యలో అతను మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ గురించి ఏం చెప్పలేను. లీగ్‌ వాయిదా వేసిన రోజు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే ఉంది’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇంతకుముందెప్పుడూ కోల్‌కతా నగరంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు. కొవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో నగరం మూగబోయినట్లు అనిపిస్తున్నదని.. ఎక్కడ చూసినా రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయని పేర్కొన్నాడు. ‘నా నగరాన్ని ఇలా చూస్తానని ఎప్పడూ అనుకోలేదు. త్వరలోనే పరిస్థితుల్లో మార్పు రావాలని ఆశిస్తున్నా. అప్పటివరకు సామాజిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండండి’ అని గంగూలీ ట్విట్టర్‌లో స్పందించాడు.