దయచేసి ఎవరు బయటకు రావొద్దు : హీరో

వాస్తవం ప్రతినిధి: ప్రపంచదేశాలను ‘కరోనా’ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా రోజురోజుకూ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా దేశాలు కరోనాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4,21,413 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 18,810 మంది మరణించారు. 1,08,388 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా కరోనా ప్రభావంతో భారత్ లో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. బయట ఎవరూ తిరగొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి చెందుతుంది … ఇళ్లకు పరిమితమై ప్రాణాలు కాపాడుకోమని ప్రభుత్వం మొత్తుకుంటుంటే అర్ధమవ్వట్లేదా అని ప్రశ్నించారు. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ఇంట్లో ఉండండి… కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి… అంతేకాని రోడ్లమీదకొచ్చి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం మాత్రం చేయొద్దని చేతులు జోడించి వేడుకున్నారు. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? … ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. జీవితం చాలా విలువైనది .. దయచేసి ప్రభుత్వం చెప్పే వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. కరోనాను అరికట్టేందుకు మనం చేయాల్సింది ఇదే అని అక్షయ్ కుమార్ తెలిపారు.