అసెంబ్లీ సమావేశాలు వాయిదా వెయ్యాలని చంద్రబాబు డిమాండ్..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలను కూడా వాయిదా వేసిందని ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయాలని చంద్రబాబు కోరారు. కరోనా వైరస్ భయంకరంగా విజృంభిస్తున్న తరుణంలో అసెంబ్లీ సమావేశాలు జరగడం అంత మంచిది కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేయడం సరైన నిర్ణయం, అలాగే ఎపి ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేయాలని ఆయన అన్నారు.కేంద్రం చేసే హెచ్చరికలను అందరూ పాటించాలి. ప్రపంచ వ్యాప్తంగా 3.75లక్షల మందికి కరోనా సోకింది. దాదాపు 17వేల మంది చనిపోయారు. కరోనా వైరస్ వచ్చిన వారు బాధ్యతగా వ్యవహరించకపోతే .. మిగిలిన వారు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. మరోపక్క ప్రభుత్వం మాత్రం అతి తక్కువ టైమ్ లోనే బడ్జెట్ సమావేశాలు ముగించడానికి రెడీ అవుతోంది.