ఎవరైనా సరే..రూల్స్ ను అతిక్రమిస్తే మిలట్రీని దింపుతా…ఖబడ్దార్!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించింది. మార్చి 31వరకు ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని…కరోనాపై సక్సెస్ అవ్వాలంటే ప్రస్తుతానికి ఇంతకు మించి మరో మార్గం లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేశారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని – మరో 114 మంది కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీని రంగంలోకి దించారని – తెలంగాణలోను ఆర్మీని రంగంలోకి దింపడం – 24 గంటల కర్ఫ్యూ – కనిపిస్తే కాల్చివేత లాంటి ఉత్తర్వులు అవసరమా అన్నారు. అలాంటి పరిస్థితిని తీసుకు రావొద్దని చెప్పారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

అమెరికా వంటి అగ్రదేశంలోనే కఠిన చర్యలు తీసుకుంటున్నారని – దేశంలో అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారన్నారు. మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయని – కాబట్టి ఆ పోలీస్ సిబ్బంది రెగ్యులర్ డ్యూటీ చేస్తారన్నారు. ప్రజలు కంట్రోల్ లో లేకుంటే పెట్రోల్ పంపులు బంద్ చేస్తామన్నారు. కరోనా కారణంగా బంద్ తో ఎకనామిక్ గా రాష్ట్రానికి నష్టమని – కానీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని – ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలన్నారు.వైద్య శాఖ ఆదేశాలు అన్ని శాఖలు పాటించాలన్నారు.పోలీసులు కొంతమంది జర్నలిస్టులు దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసిందని వారికి ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ సమాచారం ప్రజలకు పోవాలంటే మీడియాకు స్వేచ్చ ఉండాలన్నారు. మీడియా పట్ల ప్రభుత్వం దురుసుగా ప్రవర్తించకూడదన్నారు. రష్యా కరోనాను జయించిందని – బయటకు వస్తే అయిదేళ్లపాటు జైళ్లో వేస్తామని అక్కడ హెచ్చరించారన్నారు. ఎల్లుండి నుండి బియ్యం ఇస్తామని – నిధులు అకౌంట్ లో వేస్తామని చెప్పారు. సాయంత్రం ఏడు గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తామని – ఇవాళ్టి నుండి అమలు చేస్తామన్నారు. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు కట్టి వేయాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికి అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని – మూడు కిలో మీటర్ల పరిధిలోనే కూరగాయలు – నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. ఆరోగ్య శాఖకు ఎట్టి పరిస్థితుల్లోను నిధుల కొరత ఉండదన్నారు. అవసరమైతే మిగతా శాఖలకు ఆపివేసి వైద్య ఆరోగ్య శాఖ – పోలీసు శాఖలకు ఇస్తామన్నారు.