ప్రవాసాంధ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలి..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌ మహమ్మారితో వణికిపోతున్నాయి. ముఖ్యంగా యూరప్‌ దేశాలైన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీల్లో కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించడంతోపాటు ఇతర దేశాలతో తమకున్న సరిహద్దులను మూసివేశాయి. చైనా, ఇటలీ తరువాత కరోనా బాధితులు అత్యధికంగా ఉన్న దేశం అమెరికానే. ఇప్పుడు అక్కడ 33546 మంది కరోనా పాజిటివ్‍ వ్యక్తులు ఉన్నారు. మృతుల సంఖ్య 419. అయితే, కరోనా వైర్‌సపై ప్రవాసాంధ్రుల్లో అవగాహన పెంచాలని ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌(తానా) అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ సూచించారు. ప్రధానంగా విదేశాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వస్తున్న ప్రవాసాంధ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పలు దేశాల్లో ఉపాధి, ఉద్యోగ, విద్య, ఇతర రంగాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు స్వదేశానికి వస్తున్నప్పుడు ఈ వ్యాధి ప్రబలుతున్నట్లు పరిశోధనల్లో తేలినందున ప్రవాసాంధ్రులు కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.