లాక్ డౌన్ ను సీరియస్ గా పరిగణించి మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడుకోండి: మోదీ

వాస్తవం ప్రతినిధి: లాక్ డౌన్ ను సీరియస్ గా పరిగణించకపోతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని ప్రధాని మోడీ అన్నారు. లాక్ డౌన్ ను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ లో మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని కోరారు. అలా పాటించడం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడుకోవాలని కోరారు.

అలాగే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరో 15 రోజుల పాటు కొనసాగాలని, అప్పుడే వైరస్ తీవ్రత గణనీయంగా తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండటం, సోషల్ డిస్టెన్స్, కంపెనీల మూసివేత, సమావేశాల రద్దు వంటివి నెలాఖరుతో ముగియబోవని, 31 తరువాత ఇంకో వారం రోజులైనా ఇదే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నట్టు సమాచారం. నిన్న లోక్ సభ నిరవధికంగా వాయిదా పడిన తరువాత స్పీకర్ చాంబర్ వైపు మోదీ రాగా, ఆయన్ను పలువురు పార్టీల ఎంపీలు కలిశారు.

ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. లాక్ డౌన్ ఎంత కాలం కొనసాగే అవకాశాలున్నాయని ప్రధానిని ఎంపీలు ప్రశ్నించిన వేళ, మరో రెండు వారాలు ఉండవచ్చని, అప్పటికి అంతా సజావుగా మారుతుందనే భావిస్తున్నామని ప్రధాని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.