మరో దేశాధినేతను తాకిన కరోనా..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా మరో దేశాధినేతను తాకింది.. ఇప్పటికే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీకి వైరస్‌ సోకడంతో వారిద్దరు ఐసోలేషన్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తాజాగా.. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌‌ ఆదివారం నుంచి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన వైద్యుడికి ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్-19 వైరస్ సోకినట్టు నిర్ధారణైన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయానికి వచ్చారు. దీంతో మెర్కెల్ స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. మెర్కెల్‌కు రోజూ వైద్య పరీక్షలు నిర్వహించనునట్లు ఆమె అధికార బృందం తెలిపింది. ప్రస్తుతానికి ఇంటి దగ్గరి నుంచే విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పటికైతే ఆమెకు ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని, ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు వెల్లడించారు. కరోనాపై పోరులో భాగంగా బహిరంగ సభలపై నిషేధాన్ని, ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి తిరగడానికి వీల్లేదంటూ మెర్కెల్ నిషేధం విధించారు. కరోనా నివారణకు చర్యలను ప్రకటించిన కొన్ని నిమిషాల్ల వ్యవధిలోనే మెర్కెల్ సెల్ఫ్ క్వారంటైన్ ప్రకటన వచ్చింది.