అలా చేస్తే మీకు మంచిది.. దేశానికి మంచిది..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. ప్రజలెవరూ బయటకు రావొద్దని నిత్యావసర వస్తువుల కోసం కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. జనాలెవరూ గుంపులుగా ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను కూడా అనుమతించడం లేదు. అత్యవసరమైన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇటు సందట్లో సడేమియాలా కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు వ్యాపారులు. కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి.. ఆకాశానికి తాకేశాయి. దీంతో ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాంటి వ్యాపారులపై కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైతే జైలుకు పంపుతామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా సహకరిస్తే వారికి, దేశానికి మంచిదని కొడాలి నాని పేర్కొన్నారు.