ఉగాది కానుకగా టీటీడీ ఉద్యోగులకు శ్రీవారి లడ్డులు

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ ప్రభావంతో టిటిడి మరో కీలక నిర్ణయం తీసుకుంది.వైరస్ నియంత్రణలో భాగంగా భక్తులను దర్శనాలకు అనుమతించడం లేదు అధికారులు. కనుమమార్గంతో పాటు అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులను మూసివేశారు.
భక్తుల కోసం తయారు చేసిన లడ్డూల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. దీంతో ఆ లడ్డూలను టీటీడీ ఉద్యోగులకు ఉగాది కానుకగా ఇవ్వాలని నిర్ణయించారు ఆలయ అధికారులు.

కొండపైకి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శ్రీవారి లడ్డూలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా పెద్దసంఖ్యలో అదనపు లడ్డూలను తయారు చేస్తుంటారు. దీంతో భక్తులకు కావాల్సిన లడ్డూలను టీటీడీ సిద్దం చేసింది. వీటితో పాటు అదనంగా లడ్డూలను కోరుకునే భక్తుల కోసం మరో లక్ష వరకు లడ్డూలను తయారు చేశారు. అయితే కరోనా ప్రభావంతో…శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించకపోవడంతో లడ్డూల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ప్రస్తుతం తిరుమల కొండపై దాదాపు రెండున్నర లక్షల లడ్డూలు ఉన్నాయని తెలుస్తోంది. ఇవి ఇలాగే ఉంచితే పాడైపోయే అవకాశం ఉండడంతో…వీటిని ఉగాది కానుకగా సిబ్బందికి పంచాలని టీటీడీ నిర్ణయించింది.