ఏపీలో ముగ్గురికి..తెలంగాణలో 18 మందికి..

వాస్తవం ప్రతినిధి: ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేస్ నమోదైంది. విశాఖ జిల్లాలో 65 ఏళ్ల వ్యక్తి శాంపిళ్లను పరీక్షించగా కరోనా ఉన్నట్లు నిర్ధరణైంది. ఈ మేరకు విశాఖ జిల్లా వైద్యాధికారి ధ్రువీకరించారు.

ఇంతకుముందు ఏపీలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరికి కరోనా సోకింది.ఇప్పటివరకు 119 శాంపిళ్లు పరీక్షించగా ముగ్గురికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. 104 శాంపిళ్లు నెగటివ్‌గా తేలాయి. మరో 12 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరింది. లండన్ నుంచి వచ్చిన మరో ఇద్దరికి పాజిటివ్‌గా తేలినట్లు గురువారం రాత్రి తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చెప్పింది.