కరోనా ఎంత పని చేసింది..??

వాస్తవం ప్రతినిధి: కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్భందనం చోటు చేసుకుంటోంది. ఇతర దేశాల ప్రజలు రాకుండా సరిహద్దులను పూర్తిగా మూసివేస్తున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. కోరనా కోరల్లో చిక్కుకున్న పలు దేశాల్లో సంపూర్ణ ప్రజా దిగ్భందనం అమలు చేస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటికి రాకుండా ప్రజలను కట్టడి చేశాయి. విద్యా సంస్థలను, మాల్స్‌ను, మార్కెట్లను, థియేటర్లను మూసివేశాయి. అయితే కరోనా వైరస్‌ భువనగిరి వైద్య విద్యార్థినికి శాపంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం వంజరివాడకు చెందిన వెంకటేశ్‌, సరిత దంపతుల కుమార్తె, జార్జియాలోని అకాకి సెరెటెలి యూనివర్సిటీలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న శివాని, ఈ నెల 13న బస్సులో కళాశాలకు వెళుతుండగా శివాని వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో తోటి విద్యార్థులు అక్కడి ఆస్పత్రికి తరలించి, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేయించారు. నివేదికలో ఆమె మెదడులోని నాళాల్లో రక్తం గడ్డకట్టిందని తేలింది. వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. అదేరోజు భువనగిరిలోని తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. వారు వెంటనే.. తమ కుమార్తెకు హైదరాబాద్‌ కిమ్స్‌లో శస్త్ర చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించారు. జార్జియా నుంచి శివానిని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరో ఇద్దరు విద్యార్థులు కూడా టికెట్లు బుక్‌ చేసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం బుధవారం రాత్రి జార్జియాలో విమానం ఎక్కి గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే, కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ కారణంగా ఎయిర్‌పోర్టు అధికారులు శివాని విమాన ప్రయాణానికి అనుమతి నిరాకరించారు. దీంతో శివాని తల్లిదండ్రులు దిక్కుతోచని స్ధితిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.