ఎపీ ప్రభుత్వానికి సుప్రీం షాక్‌!

వాస్తవం ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని ధర్మాసనం సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఏకపక్షంగా ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సోమవారం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

కరోనా విజృంభణ నేపథ్యంలో తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఉన్న పథకాలను కొనసాగించవచ్చు.. కానీ, కొత్త పథకాలు ప్రారంభించవద్దని తెలిపింది. ప్రజలను ప్రలోభపెట్టే చర్యలు వద్దని సూచించింది. ఎన్నికల తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని తెలిపింది. ఈ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు పేర్కొంది.