ఐపీఎల్‌-13 సీజన్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్లు దూరం..?  

వాస్తవం ప్రతినిధి: చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా (కొవిడ్‌ 19) వైరస్‌ భారత దేశంలోనూ పంజా విసురుతోంది. వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లు, ప్రజల సంక్షేమం దృష్ట్యా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-13ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

షెడ్యూల్ ప్రకారం.. మార్చి 29న ప్రారంభం కావ్సాలిన 13వ సీజన్‌ ఏప్రిల్‌ 15 వరకు వాయిదా పడింది. ఐపీఎల్‌-13 సీజన్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్లు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్‌ రాబర్డ్స్‌ మాట్లాడుతూ… ‘మేం ఆటగాళ్లకి సలహాలు మాత్రమే ఇవ్వగలం. అంతిమ నిర్ణయం ఆటగాళ్లదే. అయితే ఆటగాళ్లు ఐపీఎల్‌లో వ్యక్తిగత ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బీసీసీఐ, ఐపీఎల్‌ డివిజన్‌ కూడా ఒక దృక్పథం ఉంటుంది. బీసీసీఐతో మా ఆటగాళ్లు సంప్రదించి పరిస్థితులకు తగ్గట్లుగా ఓ నిర్ణయానికి వస్తారని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.